Ami thuma ki bhalo bhasi | Episode -1 | Story of an IT girl's crush

<Episode 1> <Episode 2> <Episode 3> <Episode 4> <Episode 5> <Episode 6> <Episode 7>

 Episode 1:

కొంతమంది మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతే, మరి కొందరు గుణపాఠాలుగా మిగిలిపోతారు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే అబ్బాయి నా జీవితం లో ఎలా మారాడో ఇప్పుడే చెప్పలేను గాని అతడి పరిచయం ఎలా జరిగిందో చెప్తాను.
నేను ఒక టిపికల్ IT employee ని. ఈ రంగం లో లేని వాళ్లకి ఇదొక అందమైన అద్దాల మేడలా అనిపిస్తే ఇందులో ఉన్న నా లాంటి వాళ్లకి ఇక్కడ పని చేయడం ఒక పీడలా అనిపిస్తుంది.(మేడ పీడ.. అడ్డెడ్డెడ్డే రాస్కో రా సాంబ). ఒకర్ని ఒక చీకటి గుహలో బంధిస్తే ప్రాణం ఎలా విలవిల్లాడుతుందో అంత కంటే ఎక్కువ బాధ పడుతున్న నాకు ఓ రోజు పున్నమి చంద్రుడు లాంటి ఒక అందమైన అబ్బాయి కనిపించాడు. (మాంచి మెలోడీ ఒకటి background లో వేసుకోండి).

పోలికకి తగ్గట్టే చందమామలా తెల్లగా ఉంటాడు, మరీ ఎక్కువ చేసి చెప్పట్లేదు కానీ, ఆరడుగుల అందగాడు, చూడడానికి హీరోలా ఉంటాడు, చందమామ తో పోల్చా కాబట్టి మీకు ఒక సందేహం వచ్చి ఉండచ్చు, చందమామ కి లాగే మచ్చ కూడా ఉందేమో అని. ఆలా అనుకుంటే, మీరు సరిగ్గా ఊహించినట్టే, తనకి కూడా మచ్చ ఉంది.. అదే బొట్టు పచ్చ(ప్రాస కోసం పచ్చ బొట్టు ని తిరగేసా లెండి). అది కూడా ఒకటి రెండు కాదు మూడు tattoos.  
అంత అందంగా ఉండే అతన్ని ఏ అమ్మాయి చుసినా ఇట్టే పడిపోతుంది. అందులోనూ ఆరోజు నవ్వుతు కనిపించాడు. అంతే, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటి వరకు IT జాబ్ మీద ఉన్న చిరాకు మొత్తం ఒక్కసారిగా పోయింది. మళ్ళీ అతను ఎప్పుడు కనిపిస్తాడా అనే తపన, కనపడతాడో లేదో అనే ఆందోళనో ఏమో తెలీదు కానీ, నాకు నేనే కొత్తగా, ప్రపంచమంతా వింతగా, మనసంతా హాయిగా అనిపించాయి. (ఊహల్లో తేలిపోయే పాత పాట ఒకటి RR లో మోగింది)

ఒకప్పుడు ఆఫీస్ అంటే భయం, మా మేనేజర్ గాడు ఎప్పుడు ఎదో ఒకటి అంటూ ఉంటాడు అని. కానీ ఇప్పుడు ఆఫీస్ అంటే కొత్త ఉత్తేజం, ఉత్సాహం మళ్ళీ అతన్ని చూడచ్చు అని.
మరుసటి రోజే మళ్ళీ హీరో గారి దర్శనం జరిగింది. ఎందుకో హీరో గారు మా opposite వింగ్ లో ఉన్నాడు. ఎంక్వయిరీ చేస్తే  తెలిసింది ఏంటంటే, తాను అక్కడే వర్క్ చేస్తాడు అని. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో ఆ క్షణం లో అర్థం కాలేదు. అదే క్షణం లో నా ఆనందం కాస్తా రెట్టింపు అయింది. ఇప్పుడు ఆఫీస్ లో నాకు నచ్చేది మూడే విషయాలు: ఒకటి లంచ్ బ్రేక్, రెండు మార్నింగ్ టీ బ్రేక్, మూడు ఈవెనింగ్ టీ బ్రేక్. ఎందుకంటే బయటికి వెళ్ళినపుడు తనని చూడొచ్చు అనే ఆశ. నా అదృష్టాన్ని బట్టి  ఆ 3  బ్రేక్స్ లో ఎప్పుడైనా కనపడచ్చు. అదృష్టం నెత్తి మీద కూర్చుంటే, ఆఫీస్ అయిపోయాక cab ఏరియా లో కూడా కనపడచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నెలసరి జీతం తో పాటు బోనస్ వచ్చినట్టు.
అతన్ని చుస్తే నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలీనంతగా మైమరిచిపోతానేమో, అందుకే ఈ మధ్య మతి మెరుపు కూడా వచ్చింది అని అందరూ అంటుంటే, ఇందుకేనేమో అని క్లారిటీ వచ్చింది.

లేకపోతే రేపు ఆఫీస్ ఉందని కూడా మర్చిపోయి ఇంకా నేను మేలుకొని ఉన్నా. అతని గురించి ఆలోచిస్తూనే ఉన్నా.. కంటి మీద కునుకు వస్తే గా.. ఇంకాసేపు ఇలానే మేలుకుంటే, ఆ అబ్బాయి కాకుండా మా మేనేజర్ నా కలలోకి వచ్చే లా ఉన్నాడు. మరి నేను విశ్రాంతి తీసుకుంటేనే కదా, మీకు తరువాయి భాగం చెప్పేది.

(తరువాయి భాగం రేపు @6PM)

Comments