T.H.E | Episode 3 | A Thriller from SamosaTimes

 
 

T.H.E | Ep:3

--- బుధువారం 13/Sep/2017 ---
బుధువారం సాయంత్రం ఆరు, మనస్సు అదోలా ఉంటే సిక్ లీవ్ పెట్టి ఇంట్లో ఉండిపోయాను. ఎదో తెలీని వెలితి. శరీరం ఖాళీ గా ఉన్న ఫీలింగ్. ఆ సంఘటన జరిగినప్పటినుంచి మనసు మనసు లేదు. మెదడు లో వేరే ఆలోచన లేదు. అంతా అతను చెప్పినట్టే జరిగింది. అస్సలు ఎవరా వ్యక్తి... తనకెలా విషయం తెలిసింది. అది కూడా జరగకముందే ఎలా తెలిసింది. అతనే చేసుంటాడా. లేదు లేదు. తను అలా చెప్పడం వల్లే గా, మేలు జరిగింది. లేదంటే జీవితం ఒక్క ఉదుటున పాతాళం లోకి వెళ్లి పోయుండేది. 

ఇదంతా జరుగుతుంటే ఒక పక్క మా Sr.సైంటిస్ట్ గోల..రీసెర్చ్ లో ప్రోగ్రెస్ కావాలని. ఈ రీసెర్చ్ సక్సెస్ అయితే గవర్నమెంట్ నుంచి చాలా కాస్ట్లీ అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది అని. ఈ పరిస్థితి లో కుదురుగా ఒక చోట ఉండలేకపోతున్నా. ఇక రీసెర్చ్ ఎలా కంటిన్యూ చేయాలి.
ఇలా ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కి పోతోంది. కాస్త కాఫీ తాగుదామని పక్కనే ఉన్న చిన్న హోటల్ కి వచ్చాను. "భయ్యా.. స్ట్రాంగ్ గా ఒక కాఫీ" చెప్పి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నా. వేడి వేడి పాలు పొంగుతున్నాయ్. స్టవ్ మీద పెట్టిన దేనికీ నిలకడ ఉండదేమో.. మోసే గిన్నె కి తప్పా. నా మెదడూ పొంగుతోంది, వేడెక్కిన ఆలోచనలతో...నేను మాత్రం నిలకడ గా.. కుర్చీలో. అస్సలు నాకే ఇలా జరగాలా... వద్దు, ఇంకెవరికీ ఇలా జరగకూడదు. ఎంత స్వార్థం నాది. సమయానికి తను చెప్పకపోయుంటే ఎంత ప్రమాదం జరిగేది. అస్సలు ఎవరు తను. నాకెందుకు సహాయం చేసాడు. తనకెలా తెల్సింది. అస్సలు ఏం జరుగుతోంది నా జీవితం లో. 
 కాఫీ తాగేసి ఇంటికి వచ్చేసా. అమ్మ వంట చేస్తోంది. నిన్న జరిగిన సంఘటన తనని భయపెట్టినా ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతం గా ఉంది తను. అదే జీవితమా. కొన్నిటిని మరచిపోవడమే మంచిదేమో. కాలం బోధించే పాఠాల్లో ఇదొకటి, మరచిపోవడం. లేకపోతే, కాలం చేసే గాయాల్ని మనం తట్టుకోలేమేమో. అయినా ఇటువంటి గాయాలు మానవు. మానిపోయాయనే భ్రమలో అయినా బ్రతకాలి లేదా మానిపోవని తెలిసి భరిచడం నేర్చుకొని బ్రతకాలి. బహుశా నాన్న మరణం మాకీ పాఠం బోధపడేలా చేసిందేమో. 
అమ్మ నాకు ఇష్టమైన కాకరకాయ కూర వండుతోంది. ఇప్పుడెందుకు చేయాలన్పించిందో మరి. కాకరకాయ చేదుని తగ్గించడానికి అందులో కాస్త బెల్లం కూడా వేస్తుంది అమ్మ. ఈ చేదు, తీపి కలిపిన రుచంటే నాకెంతో ఇష్టం. నిజానికి బెల్లం వేసినంత మాత్రాన కాకరకాయ చేదు తగ్గిపోదు. ఆ చేదుని గుర్తించకుండా తీపి మనల్ని మాయ చేస్తుంది. అందుకేనేమో, నిన్న జరిగిన చేదుని మాయ చేయడానికి, మరచిపోవడానికి, ఆ గాయం మానిపించడానికి, అమ్మ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. కాకరకాయ కూర చేదు అయినా, దాన్ని చేయడానికి వెనకున్న ఉద్దేశం తీపి కాదా?.

బాల్కనీ లో నిలబడి దీర్గంగా ఆలోచిస్తుంటే గేటు దగ్గర కనబడ్డాడు watchman. ఈ గొడవలో పడి watchman సంగతే మర్చిపోయాను. ఈరోజు మార్నింగ్ లేచేసరికి గేటు దగ్గర ఉన్నాడు. ఆ బాల్కనీ డోర్ గురించి వీడికి ఏమైనా తెలుసునేమో కనుక్కుందాం అని పిలిచాను. 
"చెప్పండి సార్" అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. "నిన్న ఏమైపోయావ్. నేను ఇంటికి వచ్చేసరికి నువ్ లేవ్" అని కొంచెం సీరియస్ గా అడిగాను. "ఉన్నాను కదా సార్. మీరు మద్యాహ్నం మూడు గంటలకి వచ్చారా..మెయిన్ డోర్ keys ఆఫీసు లో మర్చిపోయారని మీ ఆఫీసు కి ఆటో లో వెళ్లి keys తీసుకురమ్మని ఒక 100 రూపాయలు కూడా ఇచ్చి పంపించారు. " అని చెప్పాడు. ఎం జరుగుతోందో ఒక నిమిషం అర్థం కాలేదు. సరే తర్వాత ఎం జరిగిందో తెల్సుకుందాం అని "తర్వాత నువ్ ఆఫీసు కి వెల్లావా మరి?" అని అడిగాను. "ఎక్కడ సార్... నేను ఆఫీసు దగ్గర దిగేలోపే మళ్ళీ మీరే కాల్ చేసి, "కీస్ దొరికేసాయ్...మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఆ ఏరియా నే కదా.. అక్కడే ఉండి మార్నింగ్ రమ్మన్నారు కదా.." అని చెప్పాడు. వీడికి ఎం చెప్పాలో అర్థం కాలేదు. "హా అవును..మర్చిపోయా.. నువ్ వెళ్ళు.." అని చెప్పి పంపేసాను.
టైం దాదాపు గా 9.30 కావొస్తోంది. అప్పుడు మళ్ళీ మోగింది ల్యాండ్ లైన్. నాకు ఎందుకో అతనే కాల్ చేస్తున్నాడనిపిస్తోంది. వెంటనే వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేశాను. 

నేను: "హలో .. who is this?"
కుమార్:" కృష్ణ...నేను కుమార్.."
నేను: " నాకు ఎం చెప్పాలో అర్థం కావట్లేదు... ముందు గా చెప్పినందుకు థాంక్స్. కాని నేను నమ్మలేదు. సమయానికి ఎవరో కార్ కి అడ్డం వచ్చి మమ్మల్ని కాపాడారు." 
కుమార్: " ఇప్పుడైనా నువ్ నన్ను నమ్ముతునావ్ అని అనుకుంటున్నాను. " 
నేను: "అవును..పూర్తిగా.." 
కుమార్: " అయితే విను...ఇది ఇక్కడితో అయిపోలేదు. చేయాల్సింది చాలా ఉంది అండ్ అదంతా నీ చేతుల్లోనే ఉంది..."
నేను: "తప్పకుండా చేస్తాను..." 
కుమార్: "సరే.. నేను నీకు మళ్లి కాల్ చేసేదాక..వెయిట్ చెయ్. అమ్మ కి ఈ విషయం నువ్వు చెప్పలేదని నాకు తెల్సు.నువ్ చెప్పకపోవడమే మంచిది. నేను కూడా చెప్పలేదు."
నేను: " నువ్వు చెప్పక పోవడం ఏంటి.." 
కుమార్: " అన్ని క్లియర్ గా అర్థం అవుతాయ్. దయచేసి నా కాల్ కోసం వెయిట్ చెయ్." 
నేను: "నిన్న మధ్యాహ్నం మా ఇంటికి వచ్చింది నువ్వేనా..??"
*** కీక్ కీక్ కీక్....కాల్ కట్ అయిన శబ్దం...***

ఏంటి ఇతను... అన్ని సగం సగమే చెప్తున్నాడు. అమ్మను అడ్డం పెట్టుకుని నన్ను blackmail చేయడానికి ట్రై చేస్తున్నాడా. ఈ ఆక్సిడెంట్ ఇతనే ప్లాన్ చేసాడా?? కాని అంత exact గా ఎవరైనా ఎలా ప్లాన్ చేయగలరు. తమ ప్రాణాలను పణం గా పెట్టి ఆ ట్రక్ డ్రైవర్ అండ్ బస్సు డ్రైవర్ ఆ ఆక్సిడెంట్ కి ఎలా ఒప్పుకుంటారు. ఇదంతా యాదృచ్చికమే అయ్యుండచ్చు. నేనే అనవసరం గా ఎక్కువ ఆలోచిస్తున్నా...
మరి ఇప్పుడు నేనేంచేయాలి. అతను చెప్పింది చెప్పినట్టు జరిగినప్పుడు, మళ్ళీ నిజామా కాదా అని ఆలోచించడం వృధా. అమ్మ విషయం లో మరొక సారి ఆ పొరపాటు చేయలేను, చేయను. ఎంతటి పనైనా చేస్తాను.ఎంత దూరమైనా వెళ్తాను. అమ్మ కోసం కాదు. నా కోసం. అమ్మ ను ప్రమాదం నుంచి కాపాడే భాద్యత తీసుకున్న కొడుకు కోసం. వెళ్తాను. 

N.E.X.T P.A.R.T tomorrow @ 6PM

Comments